Welcome to my blog

Wednesday, October 13, 2021

from my Life Journey -- (72 km in 72 years) I was bornin Attili village in 1947; brought up in Hyderabad and now settled in Ramachandrapuram since 2019, 72 km from Attili. అత్తిలి, హైదరాబాదు లే కాకుండా ఉద్యోగ రీత్యా ఎన్నో ఊళ్ళు తిరగడం తో చాలా ప్రాంతాల మాండలికాలు కూడా పట్టుబడ్డాయి. నవ్వు పుట్టించేవి కొన్ని చెప్పుకోవచ్చు సరదాగా: సుల్తాన్ బజార్ ఇంటిలో ఉన్నపుడు ఆ గల్లీలోకి అమ్ముకునే వాళ్ళు గమ్మత్తుగా అరుచుకుంటూ వచ్చి వెళ్ళే వాళ్ళు. అలాగ జాడీలు అమ్మే వాడు ఒకడు అమ్ముతుంటే మా అమ్మ చూసి ఇంటి ఆవిడని అడిగింది ‘అవి కొనవచ్చా, రేటు కరెక్టేనా ‘ అని. ఆవిడేమో ‘నీకు బుద్ధుంటే కొను, లేకుంటే లే..’ అంది. మా అమ్మ తెల్లబోయింది ఇలాగ అంటుందేమిటి అని. తరువాత అర్ధం అయింది ఆవిడ భాషలో ‘నీకుయిష్టమైతే కొను..’ అని అంత అందంగా చెప్పిందన్నమాట. ఒక సారి మా గల్లీలో ఒకరి ఇంట్లో పెళ్లి; చూద్దామని వెళ్లాము. ఒక పెద్దాయన లేచి మొదలు పెట్టాడు ఏమంటే “ ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు.. “ అనే పద్యం, ఆ తర్వాత “లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మ్రింగబోడు .. “ అంటూ మరొకటీ చదివాడు. మేము అలా నోరు వెళ్లబెట్టి చూస్తుంటే పెళ్లి అయిపోయిందన్నారు. పెళ్లిళ్ళంటే జ్నాపకమొచ్చింది. నేను చిత్తూరులో ఉండగా ఒక పెళ్ళికి ( వాళ్లెవరో నాకు తెలియదు ), పెద్దమనిషిగా పిలిచారు. నన్ను రెండు మంచి మాటలు చెప్పమన్నారు. నేను నాకు తెలిసిన సూక్తులు రెండు చదివి వధూవరులని సుఖంగా ఉండమని శుభాకాంక్షలు తెల్పాను. దానితో వాళ్ళ పెళ్లి అయిపోయింది. అంటే ఇలాంటి పద్ధతి కూడా ఉందన్న మాట. కర్నూల్ ప్రాంతంలో మా బ్యాంక్ van దిగబడి పోయినపుడు మా డ్రైవరు అక్కడ ఉన్న వాళ్ళతో ‘కాస్త దొబ్బండి బండిని ..’ అన్నాడు. అంటే బండిని తొయ్యమని అర్థం. గుంటూరు ప్రాంతం నుండి వచ్చిన మా పెద్ద వదిన వాళ్ళ ఇంటిలో ‘ అడ్డం బడ్డాడు.. ‘ అంటే జ్వరం వచ్చి పడుకున్నాడని అర్థం. జ్వరం రావడం కి నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రాతం లో ‘పాలుమాలిక అయింది ‘ అంటారు. ఓ కవి గారు తమ రచన లో వాడితే అదేదో మంచి అలంకారం అనుకున్న వాళ్ళు ఉన్నారు. విజయనగరం, విశాఖ ప్రాంతం మాండలికాలు వేరు. ‘లావు’ అనే పదం గమ్మత్తుగా వాడుతారు. ‘జ్వరం మహా లావుగా వచ్చింది’ అంటే ఎక్కువగా temparature ఉందని అర్ధం. అలాగే “ఈ సీసా పీక సన్నం మహా లావు “ అంటే బాగా సన్నం గా ఉందని అర్ధం, మనం ఊరికే confuse అయిపోతుంటాము. లడ్డూలని లాదూలంటారు. ఆ మాట మార్వాడీ ప్రభావం వలన వచ్చిందేమో. ఎందుకంటే బొంబాయిలో కూడా విన్నాము. ‘పన్నీ’ అంటే దువ్వెన. ‘చీసీయ్’ ‘కట్టియ్యే’ అంటే చేసియ్యి, కట్టి వేయి అని. విజియనగరం బస్ స్టాండ్ లో (బస్సు కోసం ) దిగాలుగా కూర్చున్నా ఆసామీని “ఎందుకయ్యా కుమిలి పోతున్నావు?” అని అడిగితే అతగాడు కోపంగా “నేనెందుకయ్యా కుమిలిపోవడం, అక్కడినుండేగా వచ్చింది.. నేను దిమిలి పోతున్నాను.. “ అన్నాడుట. కుమిలి, దిమిలి అనేవి రెండు ఊళ్ళు !! ఈ మధ్య ఎక్కడో చదివాను: “బ్యాపోచ్చి బీపు బకిరేసినాది..” అంటే శ్రీకాకుళం ప్రాంతం లో కుక్క వచ్చి వీపు బకిరింది లేక బరికింది అని అర్ధం. ఇతర భాషల ప్రభావం కూడా border ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఒక భాషలోనీ తిట్లు కూడా మరో భాషలో వాడుక పదాలుగా చలామణీ అయిపోవచ్చు. అలాగే విచిత్రమైన అర్థం లేని పదాలు కొన్ని. ఉదాహరణకి “క్షణం క్షణం సినిమాలోని “జుంబారే ఆగుంబరే..” అనే పాట. ఇందులో ఆగుంబ అనేది కర్ణాటక అడవుల్లో ఒక మారుమూల ప్రాంతమని ఇటీవలే తెలిసింది. సినిమాల నిర్మాతలూ, నటులూ వేరే దేశాలకీ వెళ్ళినపుడు పట్టుబడిన కొన్ని మాటలు కూడా సినిమాల్లో విచిత్రమైన పదాలుగా ఉంటాయి. నేను చిత్తూర్ లో ఉన్నపుడు ఆఫీసులో నా వద్ద పని చేసే ఒక ఆఫీసర్ వచ్చి “సార్! నేను రేపు లేదు” అన్నాడు. అంటే తను ఆ మర్నాడు ఆఫీస్ కి రావడం లేదన్న మాట. ఇహ చంటి పిల్లల భాషే వేరు; ఎవరి భాష వారిదే; ఆ భాషలోనే ముద్దు చేస్తుంటాము కూడా. ఆ భాషలోనే దేముడికి స్తోత్రాలు చేసే పిల్లలని కూడా చూశాను. ప్రపంచం లో కొన్ని వేల భాషలున్నాయి. అన్ని భాషల పిలుపునీ అర్ధం చేసుకునే వాడు, పలికే వాడు ఆ భగవంతుడు ఒక్కడే. పాపం ఎంత కష్ట పడుతున్నాడో కదా!! ఒక భాష – ఒక మాట (ఒక బాణం – ఒక నామం లాగా ) నేను బొంబాయి లో 14 ఏళ్ళు ఉనప్పటికీ మారాటీ పట్టుబడ లేదు. ఆఫీసులోనూ బయటా హిందీ ఇంగ్లిష్ లలో నడిచిపోయేది. ఇంట్లో పని మనిషి కూడా తెలుగుది అవడం వలన లక్ష్మికి కూడా రాలేదు. అవసరం ఉంటేకదా నేర్చుకునేది. బొంబాయి లో సెంట్రల్ ఆఫీసు తర్వాత ఒక బ్రాంచికి chief Manager గా వెళ్ళాను. ఆ బ్రాంచికి అంతకుముందు కస్టమర్స్ నుండి చాలా కంప్లేయింట్స్ ఉండేవి. నేను మార్చడానికి ప్రయత్నిస్తున్నాను. ఒక రోజున ఒకావిడ నా కేబిన్ లోకి దూసుకు వచ్చి గబగబా మారాటీ లో మాట్లాడడం మొదలు పెట్టింది. ఆపమంటే ఆపదే! మరాటీ లో అనర్గళం గా ఏదో కంప్లైంట్ చెబుతోందని మాత్రంతెలుస్తోంది కానీ ఏమిటో అర్ధం కాదు. చూసి చూసి “థాంబా” అని అరిచేశాను. థాంబా అంటే STOP అని అర్ధం. ఆవిడ సడన్ గా ఆగిపోయింది. “నాకు మారాటీ రాదు. కూర్చుని హిందీ లో చెప్పండి “ అన్నాను. ఆవిడ ఒక్క సారిగా నవ్వేసి ఈ సారి కూర్చుని మెల్లిగా చెప్పడం మొదలు పెట్టింది హిందీ లో. అంతా వరకూ తను చెప్పినదంతా వృధా కంఠ శోష అని ఆవిడకి అర్ధమయిందన్న మాట. ఇది చూసి నా కేబిన్ లో ఓ మూల కంప్యూటర్ వద్ద కూర్చున్న పంజాబీ అమ్మాయి నవ్వు ఆపుకో లేక బయటకు పరిగెట్టింది. బయట స్టాఫ్ తో చెప్పిందిట “రావ్ సాబ్ కి వచ్చిన ఒకే ఒక్క మారాటీ మాటని ఉపయోగించి కస్టమర్ని cool చేస్తున్నారు అని. అంతా నవ్వుకున్నారట.!! అదీ సంగతి. అలాగే బెంగళూర్ లో ఉన్నప్పుడు కన్నడ నేర్చుకోలేదు. పని మనిషికి వేరే భాష రాదట. కానీ “త్రో” ( throw ) అనే ఇంగ్లీష్ మాట అర్ధమవుతుంది. ఏ వస్తువైనా పారేయ్యాలంటే త్రో అని చెప్పి పని గడుపుకునే వాళ్ళం .

No comments:

Post a Comment