Welcome to my blog

Tuesday, July 16, 2024

varieties of spoken Telugu

వ్యావహారిక తెలుగు లో రక రకాలు రచన: సూరంపూడి వేంకటేశ్వర రావు హైదరాబాద్,31 మార్చి ' 24. తెలుగు లో యాసలు ఎన్నెన్నో . గోదావరి జిల్లాలు, రాయలసీమ, తెలంగాణ --ఇవి ముఖ్యమైనవిగా చెబుతారు. పాఠ్యాంశాలు కూడా ఈ యాసలలో చెప్పమంటున్నారు. ఇవి గాక ప్రతి జిల్లాకూ ఒక యాస ఉంటున్నది. ఇక కిరాస్తానీ తెలుగు అదేమిటో చాలా వేరు. పరిశుద్ధ ఆత్మ, వరపుత్రుడు, శోధన, స్వస్థత సభ -- దేమునితో కుమ్ములాట, ఒక రాత్రి స్వస్థత, గుడారాల పండగ -- ఇలా ఎంతో భిన్నమైన పదజాలం. దస్తావేజుల భాష సరే సరి. తెలంగాణ లో ఒక విధం , ఆంధ్ర లో మరొక విధం. నన్నయ గారి తర్వాత అన్నమయ్య పద కవిత్వం వచ్చే కాలానికి తెలుగులో కొన్ని మార్పులు వచ్చాయట. అన్నమయ్య వాడిన కొన్ని పదాలకు ఇప్పుడు అర్థం తెలియదు; వాడుకలో కూడా లేవు.పాల్కుర్కి సోమనాధుడు తెలపిన "యక్కల గాణం" (యక్ష గానం ) కనబడక పోయినా జాజర పాటలు కనబడుతాయి అన్నమయ్య రచనలలో. ప్రబంధ కవుల ధోరణే వేరు. రాయల వారు వారికై "నిరుపహతి స్థలం బు రమణీ ప్రియ దూ తిక ఇచ్చు కప్పురపు విడెం బు " ప్రత్యేకించి ఏర్పాటు చేశారేమో! పోతన గారు "ప్రాణంబుల్ ఠావుల్ ద ప్పే .." అని వ్రాసిన తరువాత ఈ ఠావులని మరెవరైనా వాడారో లేదో తెలీదు కాగితం ఆర ఠావులను తప్ప. అయితే ... వ్యావహారికం వ్రాయడం అంత తేలికేమీ కాదు. ఏమో! ముందు ముందు ఏ చిన్నయ సూరి లాంటి వాడో దీనికి సూత్రాలు వ్రాస్తాడేమో! వ్యావహారికం లో కలగలుపుగా మాట్లాడే పదాలు కొన్ని చూద్దాం. చేసి +వేయుము = చేసేయ్ వేసి + వేయుము = వేసేయ్ / ఏసేయ్ . ఏసెయ్ అన్నదానికి చంపి వేయు అనే అర్థం లో సినిమాల లో వాడుతున్నారు కూడా. అలాగే వ బదులు ఆ వాడేస్తున్నారు. "ఆడు మగాడురా బుజ్జీ " లాంటివి. అలాగే తోసేయ్ , కట్టేయ్ వగైరా. వచ్చేస్తా కి మూలం ఏమిటి? వచ్చి- వేస్తాడా ?॥ పోసేస్తా, కోసేస్తా , చేసేస్తా etc . కి మూలం? విశాఖపట్నం లో నాకు కొత్తగా అనిపించినవాటిలో కొన్ని: కట్ట్టీ , కట్టియ్యే, చేసియ్యే అలాంటివి. లాడు , పన్నీ -- ఇలాంటివి. అయితే ముంబాయి లో కూడా లాడు (లడ్డు), పన్ని (దువ్వెన) వగైరా వినడం తో అర్ధమయ్యింది ఇవి వేరే భాషల లోంచి వచ్చినవని; విజియనగరం వారికి రాజస్థానీ వారితో సంబంధ బాంధవ్యాలు ఏర్పడి అటునుండి విశాఖపట్నం వరకూ ఈ భాషాంతరాల పదాలు వచ్చి చేరాయేమో నని. "మొన్న పెళ్లి లో నాలుగు లాడూ లు తగిలించా " అన్నాడు ఒకాయన. సంస్కృతం లో వాడినట్లు 'వ ' కూడా వాడుతారు. కోడలు అడుగుతోంది: అప్పడాల పిండికి మినపపపప్పు వా పెసర పప్పు వా ? అని. అత్తగారు పప్పు అయిపోతుందా ? సమాధానం ఇచ్చింది : 'మినప పప్పు వే ' అని. అసలు విజయనగరం కాస్తా విజినగరం, విజినారం అయిపోనాది. ఇక అన్నాది, విన్నాది మామూలే ! ఈ విజినారం విశాఖ ల మధ్య నడిచే మరి కొన్ని పదాలు : ఒక పనిపిల్లని 'మీ ఇల్లేక్కడ ' అంటే ' అల్లక్కడ' అంది. చప్పున రమ్మని చెప్పడానికి "బేగి పారి రాయే" అని చెప్పాల్సి వుంటుంది. పారి అంటే పరిగెత్తి; బేగి , వేగిరమ్ వంటివి త్వరగా, వేగంగా అనడానికి పర్యాయ పదాలు. మనం తేలిక గా అనే నువ్వు పప్పు తప్పు; నువ్వుల పప్పు కరెక్ట్. ఇది వైజాగ్ నుండి వచ్చిన మా ఆవిడ చెప్పిన దిద్దుబాటు . "ఓలమ్మో ఓలమ్మో " ,"నీ యంకమ్మ " వంటి ఊటపదాలు కూడా కనిపిస్తాయి. శ్రీకాకుళం వైపు వినిపించేవి మరింత ఆసక్తి కారం గా ఉంటాయి. "బ్యప వచ్చి బీపంతా బాకిరేసినాది " అంటే కుక్క వచ్చి వీపు అంతా బకిరేసిందట / బరికేసిందట!! సొప్పులనేది తినే పదార్ధం. పులుచు అంటే పులుసు. తెలంగాణ భాష ఇంకొక రకం. గోదావరి జిల్లాల వారు వాడే "ఆదమరచి" అనే పదానికి "యాది మరిచి" రూపాంతరం అనిపించినా వాడుకలో భేదం ఉంది. "యాదిమరిచి వచ్చిన " వేరు; 'ఆదమరిచి నిద్ర పోవడం' వేరు. అలాగే "మధ్యాహ్నం నుంచి వస్తా " అంటారు, సాయంత్రం నాలుగు తరవాతే వస్తారు. ఇది తూగోజీ లో విన్నాను. తెలంగాణ లో చేసుకం అంటే చేయడం, తినుకం అంటే తినడం. పొద్దుగాల అంటే రేపు పొద్దున్న; టాకీ అంటే టాంక్.; ఈత కొట్టే నీళ్ళ టాకీ అంటే స్విమ్మింగ్ పూల్ .; గట్ల సేసుకం లేదు; గట్ల చేయ బట్టినాడు ; వగైరా. 'సైసు ' అంటే ఆగమని ; ఏమిటికి అంటే ఎందుకు ఆని;తోలుకు పోవడం అంటే తీసుకు వె ళ్ళ డం. మేము చిన్నప్పుడు హైదరాబాద్ సుల్తాన్ బజార్ లో రాయల్ టాకీసు కెదురుగా కందస్వామి మార్కెట్ వెనకాల గల్లీలో ఉండే వాళ్ళం. ఇంటి యజమాని ఒక ఊరి పటేల్. ఆయన భార్య తో మా అమ్మ అప్పుడప్పుడు మాట్లాడుతో తికమక (confuse) అవుతుండేది. ఉదా! ఒకసారి వీధిలోకి ఏదో ('జాడీలు , మర్టుమానులు' అని కేక వేసినట్లు గుర్తు ) అమ్మకానికి వస్తే "ఇది కొనవచ్చునా" అని అడిగినది అమ్మ. ఆవిడ "నీకు బుద్ధి ఉంటే కొను, లేకుంటే లే" అంది. మా అమ్మ తెల్లబోయి కాస్సేపటికి అర్ధం చేసుకుంది నీకు ఇష్టమైతే/ మనసు పడితే కొనమని. అంత బాగా ఉంటుంది వాళ్ళ భాష. మనం పోయాడు అనే పదం ఎప్పుడో చనిపోయినపుడు వాడతాము. వాళ్ళు అలాకాదు . "పటేల్ ఏడి కనపడటం లేదు " అని అడిగితే "పొయ్యిండు గదమ్మా" అంది ఆవిడ. పైగా "మొన్ననే పొయ్యిండు గదమ్మా--- ఊరికి " అంటే "అమ్మయ్య" అనుకున్నాము. ఆ ప్రాంతం లోనే చిన్న పుడు ఒక పెళ్లి చూశాను. ఒక పెద్ద మనిషి లేచి కొన్ని పద్యాలు చదివాడు. "ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు", "లక్షాధికారయిన లవణ మన్నమే గాని .." వగైరా. దాంతో పెళ్లి అయిపోయింది. కర్నూల్ వైపు నేను చాలా కాలం క్రితం వెళ్ళినపుడు మా van ఆగిపోతే మా డ్రైవరు అక్కడ ఉన్నవాళ్ళతో " కాస్త దొబ్బండి " అన్నాడు. అంటే కాస్త బండిని తొయ్యమని. మామూలుగా దొబ్బడం అంటే దొంగిలించడం మరి! కృష్ణా జిల్లా వారిది ఒక తరహా. ఒక పాట గుర్తుకొస్తోంది. మగ!!" వస్తా, వెళ్లొస్తా " ఆడ!! "మల్లెప్పుడొస్తా " మగ!! " రేపు సందేల కోస్తా " ఇందులో ఒకే పదం ప్రశ్న కీ జవాబుకే వాడేరు కృష్ణా జిల్లా వారు. గుంటూరు జిల్లా వారి భాష లో 'అడ్డం పడడ' మంటే జబ్బు చేయడం/ రోగం / జ్వరం రావడం. మరి కొంత దక్షిణం వైపు వేడితే ఒంగోలు నెల్లూరు జిల్లాల వారికి 'పాలుమాలిక అయ్యింది ' అంటే రోగం రావడం. ఈ మాటని భావకవితా పితామహులు రాయప్రోలు సుబ్బారావు గారు కూడా వారి అమలిన శృంగార కవితల్లో వాడినట్లు గుర్తు.'ఈ మాట బాగుందే , నా కవిత లో వాడుతా 'అని అనుకున్నాడొక ఆధునిక రచయిత, దాని అర్థం తెలియక. నెల్లూరు నుండి చెన్నయ్ వెళ్ళే దారిలో ఒక అతణ్ని 'tyre పంక్చర్ తీసేది ఎక్కడ' అని అడిగితే "నేరుగా పూడ్చు; ఆ చెట్టు ఉండలే , దాని కింద ఉండాడు" అన్నాడు. ఇంకా విచిత్రం 'ఎత్తి పెట్టడం '. అది వాళ్ళ మర్యాద. 'పండగకి చెల్లెలికి చీర ఎత్తి పెట్టినా ' అని ఒకతను గొప్పగా చెప్పుకున్నాడు. చిత్తూరు వారి భాష కి తమిళుల ప్రభావం ఎక్కువ. గడియారం పూషిం ది అంటే పాడు అయిందని అర్థం. ఇంకా చాలా అర్థాలలో కూడా వాడుతారు. నేను చిత్తూరు బ్యాంక్ చీఫ్ మేనేజర్ గా పని చేస్తున్నప్పుడు ఒక జూనియర్ ఆఫీసర్ నా వద్దకు వచ్చి "సార్! నేను- రేపు- లేదు " అన్నాడు. అని శలవు పెట్టాడు. చిత్తూరు తెలుగు లో మరొక విచిత్రం "గానీ" అన్న మాట ని " గినా " అని తిరగేసి అనడం. "సార్! మీరు గినా వేలూరు (రాయవెల్లూరు) వేడితే అక్కడ ఇడ్లీ తప్పక తినండి; బాగుంటుంది" . నిజమే! వేలూరు లో ఇడ్లీ చాలా బాగుంటుంది. ఒక ఇడ్లీ కి ఒక లీటర్ సాంబార్ లాగించేయ వచ్చు. చిత్తూరు వాళ్ళలో సగం మంది కి రోజూ వేలూరు వెళ్ళి ఇడ్లీ తిని రావడం హాబీ., అక్కడికి దగ్గిరే కాబట్టి. మద్రాసు వైపు "నిండా పూడ్చినాడు' అనీ 'మింజుమలే " అనడం వినిపిస్తుంది. నా చిన్నప్పుడు 'ఆంధ్ర పత్రిక' లో దాసు వామన రావు గారు అనే పాత్రికేయుడు వ్రాసిన మాట గుర్తుకు వస్తోంది. అప్పటి మద్రాసు రాష్ట్రం లో ఒక భోజనశాల వద్ద బోర్డు మీద "ఇచ్చట తెనుగు వాండ్లకు అన్నము వేయబడును " అని. అంత ఘోరమైన తెలుగు. తెలుగు వ్రాయడం లో పూర్వపు తెలంగాణా వారేమీ తక్కువ కాదు. చిక్కడపల్లి (హైదరాబాద్) లో ఒక హోటల్ వద్ద బోర్డు మీద "ఎవరి స్తేకిలుకు వరే బధ్యుతులు " అని వ్రాసి ఉంది. అంటే ఒత్తు వ్రాయడం లో గొడుగు కర్ర (!) ఎడమ నుండి కాక కుడి వైపు నుండి పెట్టారన్న మాట. అది సైకిల్ అని అర్థం చేసుకోవాలి మనం., మిగతా వాక్యం కూడా అంతే. అలాగే హైదరాబాద్ నుండి బెజవాడ వెళ్ళే దారిలో రోడ్డు పక్కన ఒక నిలువు బోర్డు "బల్లని చీరు " అని వుండేది. ఈ చీరడ మేమిటి అందులో బల్లని అని చుట్టూ చూస్తే ఒక వైన్ షాప్ కనపడింది. "ఓహో ! అది చల్లని బీరు దొరికే చోటన్నమాట" అని అర్థం అయ్యింది. అస్తమానూ చేయడానికి 'అదే పనిగా' అంటాము. కానీ రాయలసీమ లో 'అదే పనిగా' అంటే 'ప్రత్యేకం ఆ పని మీదే ' అని అర్థం. నేను బ్యాంక్ పని మీద అటు వెళ్ళినపుడు " ఈ సారు బ్యాంక్ డెపోసిట్ ల గురించి అదే పని గా వచ్చినారు " అని నన్ను పరిచయం చేసేవారు. ఇహ ఇంగ్లీషు తెలుగు కలగలుపు చాలా సాధారణం అయిపోయింది. అందులో ఆద్యులు గురజాడ వారే. కొత్త వారు కలిపిన మాటలు తక్కువే! "మైండ్ దొ బ్బి నది" లాంటివి అక్కడక్కడ వాడుతున్నారు. చిన్నపిల్లల భాష వేరు. అది ప్రతి చిన్న పిల్లాడికీ ప్రత్యేకం . ఎంత ముద్దో ఎంత సొగసొ! ముళ్ళపూడి వారి బుడుగు గురించి చెప్పాలి. ఎందుకంటే కొత్తరకం పదాలకి నాంది పలికాడు. "సీగాన పెసూనాంబ, చాటర్ ఢమాల్ " లాంటివి. మరి అన్నీ భాషాలనీ, అందరి మాటలనీ అర్థం చేసుకునే ఆ దేవుడు ఎంత కష్టపడుతున్నాడో !! *** *** ***

No comments:

Post a Comment